Bashar al-Assad: వెలుగు చూసిన సిరియన్ల సామూహిక సమాధులు .. ! 4 d ago
మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత అతడు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసద్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వారిని రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతాలలో బంధించి చిత్ర హింసలు పెట్టేవారని ఇదివరకే పలు మీడియా సంస్థలు వివరించాయి.
అసద్ పాలనలో 2013 నుంచి లక్ష మంది ప్రజలను వేధించి హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్న సమయంలో అమెరికాకు చెందిన పలువురు అధికారులు కుతైఫా, డమాస్కస్ కు సమీపంలోని నఝా లోని సమాధులని పరిశీలించడానికి వెళ్లారు. సామూహిక సమాధులను పరిశీలించిన తరువాత యూఎస్ కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయభారీ స్టీఫెన్ రాప్ మీడియాతో మాట్లాడుతూ నా జీవిత కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ కనీ వినీ ఎరుగనని ఆయన తెలిపారు.
అసద్ పాలనలో చేపట్టిన 'మిషనరీ ఆఫ్ డెత్స ఘోరాల్లో 2013 నుంచి లక్ష మందికి పైగా కనిపించకుండా పోయారని, చనిపోయేవరకు వారిని చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. వారికి వ్యతిరేకంగా పని చేసిన వారిని రహస్య పోలీసులు డమాస్కస్ శివార్లలోని ప్రత్యేక ప్రదేశానికి తరలించేవారని .. అక్కడ వారికి ఆహారం పెట్టకుండా హింసించి వారిని హతమార్చేవారని ఆయన తెలిపారు. మృతదేహాలను కంటైనర్లలో , ట్రక్కుల్లో ఇతర ప్రదేశాలకు తరలించి వారిని సామూహికంగా పూడ్చిపెట్టేవారని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులను హత్యచేయడానికి రసాయన ఆయుధాలను కూడా ఉపయోగించేవారన్నారు. ఈ వ్యవస్థలో కొన్ని వేల మంది పనిచేసేవారని వివరించారు.
యూఎస్ ఆధారిత సిరియన్ ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అధిపతి మౌజ్ మౌస్తఫా మాట్లాడుతూ డమాస్కస్ కు ఉత్తరాన 25 మైళ్ళ దూరంలో ఉన్న కుటేఫాలో అసద్ ప్రభుత్వం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని వివరించారు. ఈ ప్రదేశంలో లక్ష మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు గుర్తించామని తెలిపారు. మరో 66 సామూహిక సమాధులు ఉన్న ప్రదేశాలను గుర్తించామన్నారు.
1990లలో జరిగిన బాల్కన్ యుద్దాల సమయంలో దాదాపు 40,000 మంది తప్పిపోయారని.. వారిని హత్య చేసి ఉంటారా అనే విషయం తెలుసుకోవడానికి వారి బంధువుల్లో కనీసం ముగ్గురి డీఎన్ఏ తీసుకుని అస్థిపంజరం అవశేషాలతో పరీక్ష చేయాలి అని మౌస్తఫా పేర్కొన్నారు. అస్థిపంజరాలు పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండేందుకు వాటిని శీతలీకరణ ట్రక్కుల్లో భద్రపరుస్తామని వెల్లడించారు.